ఎడిట్ నోట్: కేసీఆర్…జగన్…ఓ జీఎస్టీ!

-

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ అనూహ్య నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు కష్టాలు పెరిగేలా ఉన్నాయి…ఊహించని విధంగా జీఎస్టీ విధానంలో మార్పు తీసుకురావడం…సామాన్యులకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులని సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడంతో…ఇప్పుడు సామాన్యులపై భారం పడనుంది. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రిప్యాక్డ్ అండ్ లేబుల్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఉదాహరణకు ఫ్లోర్, పెరుగు, లస్సీ, పన్నీర్, తేనే, మాంసం, ఫిష్ వంటి వాటిపై ధరలు పెరగనున్నాయి. వీటిపై 5 శాతం జీఎస్‌టీ పడుతుంది. అయితే ఇదివరకు వీటిపై ఎలాంటి జీఎస్‌టీ లేదు. జూలై 18 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఇంకా సామాన్య ప్రజలకు అవసరమయ్యే వస్తువులపై జీఎస్టీ పెరిగింది.

ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్‌, ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ ల్యాంప్స్‌పై 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు. అలాగే హాస్పిటల్ రూమ్స్ పై, బ్యాంక్ చెక్ బుక్ లపై, ఆఖరికి బ్లేడులు, కత్తులు, పెన్సిల్, షార్ప్‌నర్స్, స్పూన్స్, ఫోర్క్‌డ్ స్పూన్స్ పై కూడా జీఎస్టీ పెరిగింది. ఇలా సామాన్య ప్రజలపై జీఎస్టీ భారం పడనుంది…ఇక దీనిపై దేశ వ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. పార్లమెంట్ లో సైతం ప్రతిపక్షాలు..కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. అలాగే పార్లమెంట్ ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు.

అయితే జీఎస్టీ భారం పెరుగుదలపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడిచే షాపుల్లో, అలాగే చిన్న చిన్న దుకాణాలలో ఒకటి, రెండు కేజీల ప్యాకెట్ల రూపంలో విక్రయించే వస్తువులపై జీఎస్టీ విధించబోమని ప్రకటించింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు కాస్త ఊరట లభించింది. అలాగే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడంపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి  కేరళ సీఎం విజయన్ లేఖ రాశారు.

ఇక ఇలా కేరళ నిర్ణయం తీసుకోవడంతో…రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చేస్తారా? అని ఏపీ, తెలంగాణ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రజలపై పడిన భారాన్ని ఎంతోకొంత తగ్గించాల్సిన బాధ్యత అటు కేసీఆర్, ఇటు జగన్ పై కూడా ఉంది. కానీ రెండు రాష్ట్రాలు అసలే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయాయని తాజాగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. రెండు రాష్ట్రాల్లో శ్రీలంక పరిస్తితులు ఏర్పడుతున్నాయని కామెంట్ చేసింది. మరి ఇలాంటి పరిస్తితుల్లో ప్రజలపై పడే భారాన్ని రెండు ప్రభుత్వాలు ఏ మేరకు తగ్గిస్తాయనేది చూడాలి.

అయితే జీఎస్టీ విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు…ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు..ఇటు మంత్రి కేటీఆర్ సైతం…కేంద్రం టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఇలా కేంద్రంపై విరుచుకుపడుతున్న టీఆర్ఎస్ సర్కార్…సొంతంగా ప్రజలపై జీఎస్టీ భారం తగ్గించే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి. మొత్తానికైతే జీఎస్టీ భారం వల్ల సామాన్య ప్రజలకు కష్టాలు పెరిగేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news