ఎన్టీఆర్ నుంచి నరేంద్ర మోదీ వరకు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన టీడీపీపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు మొహం చెల్లకే సభకు రాలేదని అన్నారు. అన్ని రంగాల్లో చూస్తే టీడీపీ చేసిన చెడు.. వైసీపీ చేసిన మంచే కనిపిస్తుందని జగన్ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సంస్కరణల్లో విజన్ ఎవరికి ఉందో అర్థం అవుతుందని ఆయన అన్నారు. రాజధాని వికేంద్రీకరణ వద్దని అన్న వ్యక్తే జిల్లాల వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారని… బాబుగారి బావ మరిది కూడా హిందూపురాన్ని జిల్లా చేయాలని వైసీపీని అడుగుతున్నారని.. స్వయంగా కుప్పం రెవెన్యూ డివిజన్ చేయాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకుంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లే వచ్చాయని గుర్తు చేశారు.
మరో ఐదేళ్లు చంద్రబాబు అధికారంలో ఉండుంటే ప్రభుత్వ స్కూళ్లను మూసేసేవారు అని … వైసీపీ ప్రభుత్వం స్కూళ్లకు వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని జగన్ అన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ స్కూళ్లకు కార్పోరేట్ కళ తీసుకువచ్చామని ఆయన అన్నారు. వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చినట్టు.. డ్వాక్రా మహిళలను చంద్రబాబు రోడ్డు పైకి ఈడ్చారని విమర్శించారు. సత్యనాదెళ్లకు తానే కంప్యూటర్ చదువు చెప్పించాను.. పీవీ సింధుకు నేనే బ్యాడ్మింటెన్ నేర్పించానని చెప్పుకునే చంద్రబాబు దిశా యాప్ రూపొందించాలని.. గ్రామ సచివాలయాలు నిర్మించాలనే ఆలోచన రాలేదా..? అంటూ జగన్ ప్రశ్నించారు.