దుబ్బాకకు భిన్నంగా సాగర్‌లో వ్యూహరచన చేస్తున్న బీజేపీ

-

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై చివరి దశకు చేరుకుంటోంది. బీజేపీ అభ్యర్థి పై ఇంకా స్పష్టత లేదు.క్యాండిడేట్‌ ప్రకటనలో జాప్యం పై పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది. ఎవరిని బరిలో నిలపాలో తేల్చుకోలేక పోతున్నారో.. మరేదైనా వ్యూహం ఉందో ఏమో పార్టీ వైఖరి కేడర్‌కు అంతు చిక్కడం లేదు. దుబ్బాక ఉపఎన్నికలో దూకుడుగా వెళ్లిన బీజేపీ సాగర్‌లో భిన్నంగా వెళ్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన నివేదితా రెడ్డి ఉపపోరుకూ సై అంటున్నారు. ఇప్పటికే నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మరో నాయకుడు అంజయ్య యాదవ్‌ నేనున్నాను అని చెబుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి, రవినాయక్‌లు సైతం బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమకున్న పరిచయాలతో హైదరాబాద్‌ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్‌ చేసుకుంటున్నారు ఆశావహులు. కానీ.. బీజేపీ పెద్దలు వీరెవరిపైనా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ జానారెడ్డి పేరు ప్రకటించడంతో ఆ సామాజికవర్గం నుంచి కాకుండా మరో సామాజికవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోందట. అయితే అలా అందుబాటులో ఉన్నవారు ఎవరో తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. స్థానిక నాయకులు కూడా ఎవరో ఒకరి పేరు చెప్పకుండా ఎవరికి తోచిన పేరు వారు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. సాగర్‌లో బీజేపీకి క్షేత్రస్థాయిలో అంతగా పట్టులేదు. అందుకే పార్టీకి తోడు అంతో ఇంతో ప్రభావం చూపించే అభ్యర్థి బెటర్ అని లెక్కలేస్తుంది. అప్పుడే ఇటు టీఆర్‌ఎస్‌ను అటు కాంగ్రెస్‌ను తట్టుకుని పోరులో నిలబడగలమని భావిస్తున్నారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు నాగార్జునసాగర్‌లో తేడా వస్తే అది బీజేపీ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపెట్టే ప్రమాదం ఉంది. దీంతో అభ్యర్ది ఎంపిక పై ఆచితూచి వ్యవహరిస్తుంది. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయడానికి చాలా మంది టికెట్‌ ఆశిస్తున్నారు. వారిలో టికెట్‌ రాకుండా నిరాశ చెందిన బలమైన నేతలు ఎవరైనా బీజేపీతో టచ్‌లోకి వస్తారన్న ఆశలు కూడా ఉన్నాయట. అందుకే పోటీకి సుముఖత వ్యక్తం చేస్తున్న పార్టీ నేతల పేర్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news