కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. టీఎంసీలో చేరనున్న ఆజాద్!

-

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్ మంగళవారం న్యూఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కీర్తి ఆజాద్ బీజేపీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదని, ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె మాత్రమే నిద్ర లేని రాత్రులను ఇవ్వగలదని కీర్తి ఆజాద్ నమ్ముతున్నట్లు సమాచారం.

క్రికెట్ నుంచి పొలిటీషియన్‌గా మారిన కీర్తి ఆజాద్ బిహార్ రాష్ట్రంలోని దుర్బంగా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2014, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బహిర్గంగా అవినీతి ఆరోపణలు చేయడంతో 2015లో పార్టీ నుంచి కీర్తి ఆజాద్‌ను సస్పెండ్ చేశారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో అరుణ్‌జైట్లీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని కీర్తి ఆజాద్ దుమ్మెత్తిపోశారు.

కీర్తి జాద్ తండ్రి భగవత్ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. గోవాలో లూయిజిన్హో ఫలేరో, అసోంలో సుస్మితా దేవ్ కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరిన తర్వాత కీర్తి ఆజాద్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం.

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని పర్యటనకు ఆమె వెళ్లారు. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్న దీదీ బీఎస్‌ఎఫ్ పరిధి, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news