ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల గోల ఎక్కువైన విషయం తెలిసిందే. అటు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసిఆర్..ఇటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్..గడువు కంటే ముందు గానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. తెలంగాణలో ఎలాగో గతంలో కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి కేసిఆర్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజేపిలు..ఖచ్చితంగా కేసిఆర్ ముందస్తుకు వెళ్తారని అంటున్నాయి. కానీ బిఆర్‌ఎస్ నేతలు మాత్రం ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని, ఈ సారి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరూగుతాయని అంటున్నారు.
అయితే తెలంగాణలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే తెలంగాణ విషయం పక్కన పెడితే..ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ అధికారంలో జగన్ సైతం ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని ఇక్కడ ప్రతిపక్ష టిడిపి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది.ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఇంకా పూర్తిగా వ్యతిరేకత పెరగక ముందే జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని అంటున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు పదే పదే ముందస్తుపై కామెంట్ చేస్తూనే ఉన్నారు.
కానీ అధికార వైసీపీ నేతలు మాత్రం ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు.అయితే ఎవరి వ్యూహం ఎలా ఉందో ఎవరికి క్లారిటీ లేదు. ముందస్తుపై నిర్ణయం మాత్రం జగన్‌దే..ఆయన వ్యూహం ఎలా ఉందనేది తెలియదు. కానీ టిడిపి మాత్రం ఓ అంచనా వేస్తుంది. ముందస్తు జరుగుతుందని భావిస్తున్నారు. తాజాగా ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ముందస్తుపై కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఖాయంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేసుల నుంచి కాసుల దాకా అనేక సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారని, అవి తనను ముంచేయక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయుంచుకున్నారని చెప్పుకొచ్చారు.
ముందస్తుకు తాము రెడీగా ఉన్నామని, రేపు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయమని, జగన్ రెడ్డి మాదిరిగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తులు చెప్పుకోవడం తమకు అలవాటు లేదని అన్నారు. అయితే ఇలా ముందస్తుపై టిడిపి ధీమాగా ఉంది. కానీ వైసీపీ నుంచి ముందస్తుపై క్లారిటీ లేదు. చూడాలి మరి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయో లేదో.