చైనాలో మరో భయంకరమైన వింత కానొచ్చింది. దేశ రాజధాని బీజింగ్‌లో పురుగుల వర్షం కురిసింది. నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షం కురిసింది. దీంతో పాటు పురుగులు కూడా పడ్డాయి. పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు ఉపయోగించి తమను తాము రక్షించుకున్నారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజింగ్ రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతోపాటు పెద్ద సంఖ్యలో పురుగులు పడినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అయితే ఈ పురుగుల వర్షానికి కారణం ఏమిటన్నది తెలియలేదని తెలిపింది. భారీ గాలులకు బురదలోని పురుగులు పైకి కొట్టుకెళ్లి వర్షంతోపాటు ఇలా పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్‌వర్క్ వారు వెల్లడించారు.
తుఫాను తర్వాత వీచే భారీ గాల్లుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆ జర్నల్ పేర్కొన్నట్లు తెలిపారు. కాగా, చైనాలో పురుగుల వర్షానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ఇన్‌సైడర్ పేపర్ శనివారం ట్విట్టర్‌లో పోస్ట్ విడుదల చేసింది. పురుగులు మీద పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినట్లు అందులో తెలిపింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
మరోవైపు చైనా జర్నలిస్ట్ షెన్ షివే దీనిని ఖండించారు. పురుగుల వర్షం వీడియో ఫేక్ అని అన్నారు. బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షాలు కురియలేదని చెప్పారు. నేను బీజింగ్‌లోనే ఉన్నాను. ఈ వీడియో నకిలీది. ఈ వారంలో బీజింగ్‌లో వర్షాలు పడలేదు’ అని ట్వీట్ చేశారు షెన్.