వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పలువురు సీనియర్ నేతలు తమ వారసులని రంగంలోకి దింపడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో దింపి తమ వారసులని గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం తన ఇద్దరి వారసులకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. కానీ జానారెడ్డి వారసులకు సీటు దక్కుతుందా? లేక జానారెడ్డి బరిలో ఉంటారా? అనేది క్లారిటీ లేదు.జానారెడ్డి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో మొదలైన విషయం తెలిసిందే. 1983లో చలకుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. మళ్ళీ అదే ఊపులో 1985లో గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి జంప్ చేసి 1989 ఎన్నికల్లో గెలవగా, 1994లో ఓటమి పాలయ్యారు..
1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో పోటీ చేసి గెలిచారు. ఇలా వరుస విజయాలు దక్కించుకున్న జానారెడ్డికి 2018లో షాక్ తగిలింది. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.అయితే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహం చనిపోవడంతో సాగర్ ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో తన వారసుడు రఘువీర్‌ని నిలబెట్టాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డినే నిలబెట్టింది. ఉపఎన్నికలో కూడా జానారెడ్డి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో తన తనయులని బరిలో దింపాలని చూస్తున్నారు. సాగర్ లో జయవీర్, మిర్యాలగూడలో రఘువీర్ పోటీ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ స్థానాల్లో ఇద్దరు వారసులు ముమ్మరంగా పర్యటిస్తున్నారు.
మరి ఈ సారి జానారెడ్డి వారసులకు అధిష్టానం ఛాన్స్ ఇస్తుందా? మళ్ళీ జానారెడ్డినే బరిలో దిగాలని ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి. జానారెడ్డికి ఈ సారి కూడా పోటీ చేయాలని ఉంటే..సాగర్ లో ఆయనే బరిలో ఉంటారు. ఒకవేళ మిర్యాలగూడ సీటు ఇస్తే వారసుల్లో ఎవరోకరు పోటీలో ఉంటారు. చూడాలి మరి జానారెడ్డి వారసులకు సీటు దక్కుతుందో లేదో.