తెలంగాణలో తమని టార్గెట్ చేసిన బీజేపీకి రాష్ట్రంలోనే కాదు..కేంద్రంలో కూడా చెక్ పెట్టాలని చెప్పి కేసీఆర్ రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీని గట్టిగా టార్గెట్ చేసిన కేసీఆర్…కేంద్ర స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసే పనిలో ఉన్నారు. అలాగే జాతీయ పార్టీ పెట్టి..కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. త్వరలోనే జాతీయ పార్టీ ప్రకటన ఉండేలా ఉంది. ఇప్పటికే దీనిపై కేసీఆర్ చర్చలు చేస్తున్నారు. జాతీయ పార్టీ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై కసరత్తు చేస్తున్నారు.
అయితే జాతీయ పార్టీ ద్వారా..బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. కానీ కేవలం ప్రాంతీయ పార్టీకి చెందిన కేసీఆర్..జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పగలరు? జాతీయ పార్టీ పెడితే సత్తా చాటగలరా? అనే డౌట్లు అందరికీ ఉన్నాయి. ఇక ఈ విషయంలో కేసీఆర్ పకడ్బందీగానే ముందుకెళ్లనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం.
ఇదే క్రమంలో 2024 లోపు ఎన్నికలు జరగనున్న.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రజల అవసరాలేమిటి? వారు ఆశిస్తున్న పథకాలు ఏమిటి? అనే విషయాలను ఓ సర్వే ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి.. వేర్వేరు బృందాలను ఆ రాష్ట్రాలకు పంపి సర్వే రూపంలో సమాచారాన్ని తెప్పించుకోవాలని కేసీఆర్ నిర్ణయంచారట.
అదే సమయంలో ఈ బృందాల్లో పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారని తెలిసింది. నాలుగు రాష్ట్రాల్లో సర్వే చేసి..ప్రజల నాడి తెలుసుకుంటారట. అలాగే ఈ రాష్ట్రాల్లో తమ పార్టీ టికెట్‌పైన పోటీ చేసే అభ్యర్థుల గుర్తింపు, వారి ఆసక్తులను తెలుసుకోవాలనుకుంటున్నారని టాక్. మొత్తానికి జాతీయ స్థాయిలో రాణించడానికి కేసీఆర్ గట్టిగానే స్కెచ్ వేశారు. కానీ జాతీయ పార్టీ సక్సెస్ అవ్వడం అనేది ఈజీ కాదు. మరి కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.