తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్ని సమస్యల పరిష్కారానికి ఇంచార్జీగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను గోవాకు బదిలీ చేసి.. అక్కడ ఇంచార్జీగా ఉన్న మాణిక్ రావు థాక్రేను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీగా అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే ఇవాళ మొదటి సారి రాష్ట్రానికి వచ్చారు. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాణిక్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఇక ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు థాక్రే గాంధీ భవన్ లో వివిధ స్థాయి నేతలతో భేటీ అవుతారు. తొలి రోజు ఏఐసీసీ ఇన్చార్జ్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో విడివిడిగా మాట్లాడుతారు.
తర్వాత సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లను థాక్రే కలుస్తారు. మధ్యాహ్నం పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీసీసీ ఆఫీసర్ బేరర్లతో సమావేశం అవుతారు. గురువారం డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, వివిధ సెల్స్, డిపార్ట్మెంట్ల చైర్మన్లతో ఆయన మాట్లాడుతారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. కాగా, మాణిక్ రావుకు స్వాగతం పలికిన వారిలో భట్టి విక్రమార్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, మెట్టు సాయి కుమార్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఉన్నారు.