నిజామాబాద్ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నాయకుల దాడి అనంతరం ఇరు పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నాయి. ఉదయం ఎంపీ అరవింద్.. టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై విమర్శలు చేయగా… తాజాగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ అరవింద్ పై విమర్శలు గుప్పించారు.
ఎంపీ అరవింద్ ను పసుపు రైతులే ఉరికిచ్చి కొడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. బాండు పేపర్ల ఎంపీకి చేతనైతే పసుపు బోర్డు తీసుకురావాలని ఛాలెంజ్ విసిరారు. నిన్న దాడి చేసినవారంతా 100 శాతం రైతులే అని.. రైతుల దెబ్బకు అరవింద్ పారిపోయారని అన్నారు. మేం పిలుపునిస్తే అరవింద్ ఆర్మూర్ కూడా దాటలేరని హెచ్చరించారు. అరవింద్ ఫాదర్ ఆఫ్ లయర్ గా విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తే చెప్పులతో సమాధానం చెబుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కు చేతనైతే… కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని… మేమే సన్మానం చేస్తామని జీవన్ రెడ్డి అన్నారు. తండ్రితో సంబంధం లేదని చెప్పుకునే ఏకైక కుమారుడు అరవింద్ అని అన్నారు. వారి ఇంట్లో మూడు పార్టీలు మూడు కుంపట్లు అని ఎద్దేవా చేశారు.