జగన్ 2.0 వెర్షన్ లోడ్ అవుతోంది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కు సంబంధించి ప్రొగ్రామింగ్ రాస్తున్నారు. అవ్వంగానే విడుదలే తరువాయి. మార్పు అన్నది ఇక లాంఛన ప్రాయమే ! అందుకే జగన్ మునుపటి కన్నా ఇప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా తన వారిలో తనను నమ్మకున్న వీర విధేయులు అయిన భక్తులలో కూడా భరోసా నింపుతున్నారు. ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో అధికారం కైవశం చేసుకోవడమే ధ్యేయంగా పనిచేయాలని తలపోస్తున్నారు.
అందుకు అనుగుణంగా ఏం చేయాలో అంతా ఇప్పటి నుంచే చేస్తున్నారు. ఎన్నికలకు సుదూర దూరం ఉన్నా (2024 పోల్ సీన్ కు రెండేళ్ల కాల వ్యవధి ఉంది) ఆయన అవేవీ పట్టించుకోకుండా ఇప్పటి నుంచే తన పనిని సులువు చేస్తున్నారు. కొందరి పనిని క్లిష్టతరం చేస్తున్నారు. ఆ విధంగా ఆయన ముందు జాగ్రత్త చర్యలు వేగవంతం చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త ముఖాలకు అగ్రభాగం దక్కనుంది. చాలా మంది ఆశావహులకు రాజయోగం దక్కనుంది. రోజా, అంబటి రాంబాబు లాంటి భక్తులకు ఓ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో జగన్ ఉన్నారు.
ఓ విధంగా పునర్వ్యవస్థీకరణ అన్నది కొత్త ట్రెండ్ ఏమీ కాదు. కానీ ఇప్పటిదాకా మూడేళ్ల ఒకరికి మరో రెండేళ్లు ఇంకొకరికి చొప్పున ఒకే మంత్రి పదవిని ఇద్దరికి పంచిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎన్టీఆర్ తన క్యాబినెట్ ను బర్తరఫ్ చేశారు. కానీ జగన్ మాత్రం ఇప్పటి మంత్రుల నుంచి రాజీనామా లేఖలు తీసుకుని కొత్త వారిని వారి స్థానంలో నియమించి ఐదేళ్ల పాలన కాలాన్ని సజావుగా పూర్తి చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీనియర్లను తప్పించి జూనియర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన సీఎం కూడా జగనే ! ఈ సారి కూడా బీసీలకు అగ్రభాగం ఇచ్చి, తన సామాజికవర్గం మనుషులకు ఒకట్రెండు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఓ విధంగా సీనియర్లంతా పార్టీకి జూనియర్లంతా జగన్ తో కలిసి ప్రభుత్వ సంబంధ కార్యాచరణకు సిద్ధం కావాల్సి ఉంది. ఓ విధంగా ఇది శుభ పరిణామమే కానీ అసంతృప్త వాదులు తిరుగుబాటు చేస్తే
చెప్పలేం.