‘సిటీ’లో మైలేజ్ పెరగట్లేదా..!

-

ఏపీలో రూరల్ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా ఉందనే సంగతి తెలిసిందే…కానీ అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ బాగా వీక్ గా ఉంది..ఆ విషయం గత రెండు ఎన్నికల్లోనూ రుజువైంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా సరే నగరాల్లోని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటలేకపోయింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి లాంటి నగరాల్లో టీడీపీ హవా నడిచింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, మచిలీపట్నం, ఒంగోలు లాంటి స్థానాల్లో కేవలం తక్కువ మెజారిటీలతో గెలిచి బయటపడింది.

అయితే అధికారంలోకి వచ్చాక కూడా సిటీల్లో వైసీపీ బలం పెద్దగా పెరిగినట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ సిటీపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే నగరంలోని నాలుగు సీట్లని టీడీపీ కైవసం చేసుకుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు టీడీపీ ఖాతాలో పడ్డాయి. దీంతో ఆ స్థానాల్లో టీడీపీని వీక్ చేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది. ఇదే క్రమంలో మూడు రాజధానుల ప్రకటన చేసి..విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించింది.

అలాగే సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలోకి తీసుకొచ్చింది. అయినా సరే విశాఖ నగరంలో వైసీపీ ఫుల్ గా పికప్ అవ్వలేదు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్తితుల్లో సిటీలో ఇప్పటికీ ఈస్ట్, వెస్ట్ స్థానాల్లో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. ఈ సీట్లని టీడీపీ మళ్ళీ కైవసం చేసుకుంటుందని సర్వేల్లో తేలింది. ఇక సౌత్‌లో వైసీపీ-టీడీపీల మధ్య గట్టి ఫైట్ ఉందని, నార్త్ సీటులో వైసీపీకి ఎడ్జ్ ఉందని తేలింది.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…నెక్స్ట్ ఎన్నికల్లో గాని టీడీపీతో జనసేన పొత్తు ఉంటే మళ్ళీ సిటీలో వైసీపీకి సున్నా అని తెలుస్తోంది. పొత్తు లేకపోతే మాత్రం రెండు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి విశాఖ సిటీలో వైసీపీ మైలేజ్ పూర్తిగా పెరగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news