ఎడిట్ నోట్: కేసీఆర్ ‘స్టీల్’ పాలిటిక్స్.!

-

తెలంగాణ సి‌ఎం కేసీఆర్..ఎజెండా ఇప్పుడు ఒకటే..ఎక్కడైనా సరే కేంద్రంలోని బీజేపీకి చెక్ పెట్టడం. ఆ దిశగానే ఆయన రాజకీయం చేస్తున్నారు. అంటే కేంద్రంపై పోరాటం చేస్తూ..రాజకీయంగా లబ్ది పొందాలనే కాన్సెప్ట్ తో ఉన్నారు. ఇంతకాలం తెలంగాణలో ఎవరోకరిని టార్గెట్ చేసి రాజకీయంగా పబ్బం గడిపారు. 2014లో తెలంగాణ సాధించిన వారీగా సత్తా చాటారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుని టార్గెట్ చేసి..అదిగో ఆంధ్రా వాళ్ళ పెత్తనం ఎక్కువైందని ప్రచారం చేసి గెలిచారు.

ఇక ఇప్పుడు కేంద్రం అసలు రాష్ట్రానికి సహకరించడం లేదని, బి‌జే‌పి వాళ్ళు రాజకీయ కక్ష సాధిస్తున్నారని చెప్పి, వారిని టార్గెట్ చేశారు. పైగా ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బి‌జే‌పిపై పోరాటం మొదలుపెట్టారు. ఇక ఏ రాష్ట్రంలోనైనా కే‌సి‌ఆర్..తమ శత్రువుగా బి‌జే‌పినే చూస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ రాజకీయాలపై కూడా కే‌సి‌ఆర్ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ పార్టీ శాఖ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించారు. అలాగే అక్కడ రాజకీయంగా బలపడేందుకు కే‌సి‌ఆర్ కొత్త ఎత్తులతో వెళుతున్నారు.

పైగా అక్కడ అధికార వైసీపీ , ప్రతిపక్ష టి‌డి‌పి, జనసేనలు సైతం బి‌జే‌పిని ఏమి అనలేని పరిస్తితి. అందుకే ధైర్యంగా రాష్ట్ర సమస్యలపై గళం విప్పడం లేదు. విభజన హామీలని గాలికొదిలేశారు. ఇదే క్రమంలో కొన్ని సమస్యలపై నోరు మెదపడం లేదు. దీంతో కే‌సి‌ఆర్..గేమ్ స్టార్ట్ చేశారు. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా వెళుతున్న అంశంపై గళం విప్పారు.

ఈ అంశంలో కేంద్రాన్ని గట్టిగా టార్గెట్ చేస్తూనే..రాష్ట్రంలోని ఉన్న పార్టీలని టార్గెట్ చేశారు. అదే సమయంలో కేంద్రం స్టీల్ బిడ్డింగ్‌కు ప్రతిపాదించిన నేపథ్యంలో బిడ్డింగ్ లో పాల్గొనాలని కే‌సి‌ఆర్ డిసైడ్ అయ్యారు. అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. అది కూడా బొగ్గు, ఇనుప ఖనిజం సరఫరా చేసే సంస్థల్లో బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని ఈవోఐ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది.

విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్‌లో పాల్గొనడం ద్వారా బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా మైలేజీ వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  కే‌సి‌ఆర్  ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు బిడ్డింగ్‌లో పాల్గొంటోన్నారు. ఒకవేళ ఈ బిడ్డింగ్‌ను దక్కించుకుంటే.. నైతికంగా కేంద్రంపై విజయం సాధించినట్లవుతుంది. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా కే‌సి‌ఆర్ భారీ ప్లాన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news