ఎడిట్ నోట్: అధికారం x ఆత్మగౌరవం x అభిమానం

తెలంగాణ ప్రజలు ఇప్పుడు మునుగోడు వైపు చూస్తున్నారు…ఇక్కడ ఏ రాజకీయ పార్టీ పైచేయి సాధిస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి…తాజాగా కాంగ్రెస్ పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇక బీజేపీలో చేరడం ఖాయమే. ఇక ఇదంతా సాధారణ ప్రక్రియే…అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక జరగనుంది.

ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే..మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్తు. ఎందుకంటే సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంది. ఈ ఉపఎన్నికలో వచ్చే తీర్పు బట్టే…సాధారణ ఎన్నికల తీర్పు ఆధారపడి ఉంటుంది…ఉపఎన్నికలో గెలిచే పార్టీకి ప్రజల మద్ధతు ఎక్కువ ఉంటుందని అర్ధమవుతుంది. అందుకే ఈ ఉపఎన్నికని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ నడవనుంది.

ఈ ఫైట్ లో పైచేయి సాధించాలని మూడు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తాయి. అయితే ఇందులో టీఆర్ఎస్ అధికార బలంతో గెలవాలని, బీజేపీ ఏమో ఆత్మగౌరవం నినాదంతో గెలవాలని, అటు కాంగ్రెస్ ఏమో అభిమాన బలంతో గెలవాలని చూస్తుంది. అసలు మూడు పార్టీల మూడు కథలు ఒకసారి చూద్దాం.

అధికారం:

ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక చాలా కీలకం…ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోయి ఉంది..మునుగోడులో కూడా ఓడిపోతే..సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు చాలా కష్టమవుతుంది. అందుకే ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని చూస్తూ ఉంది. మునుగోడులో ఇప్పుడుప్పుడే టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగతంగా బలం వచ్చింది. కానీ ఈ బలం ఉపఎన్నికలో గెలవడానికి సరిపోదు…అందుకు పూర్తిగా అధికార బలాన్ని నమ్ముకునే మునుగోడు బరిలో దిగుతుంది. మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వడం, పథకాల పేరుతో ప్రజలు డబ్బులు ఇవ్వడం, ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న సమస్యలని పరిష్కరించడం…ఇలా ఒకటి అని కాదు గెలవడానికి అన్నిరకాలుగా అధికార బలాన్ని ఉపయోగించడం ఖాయం.

ఆత్మగౌరవం:

ఆత్మగౌరవం..ఇదే ఇప్పుడు బీజేపీ నినాదం…ఇదే నినాదంతో హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచారు..ఇప్పుడు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అదే నినాదంతో ముందుకెళ్లనున్నారు. చెప్పాలంటే మునుగోడులో బీజేపీకి బలం లేదు. అసలు ఎప్పుడు ఇక్కడ రెండోస్థానంలోకి కూడా రాలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పార్టీ పుంజుకుంటుంది. అలా అని మునుగోడులో పుంజుకుంటుందని చెప్పలేం. కేవలం ఇక్కడ రాజగోపాల్ బలం మీద ఎన్నికలకు వెళ్ళాలి. ఆయనని నమ్మి ప్రజలు ఓట్లు వేయాలి. కోమటిరెడ్డి సైతం తనని చూసి ఓట్లు వేయమని అడిగే పరిస్తితి ఉంటుంది. అలాగే కేంద్రం సపోర్ట్ కూడా ఉంటుంది. మొత్తానికి మునుగోడులో బీజేపీ…కోమటిరెడ్డిపై ఆధారపడి ముందుకెళ్లాలి.

అభిమానం:

మునుగోడు ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఎక్కువే. మొదట నుంచి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి..మునుగోడులో అయిదుసార్లు గెలిచారు. ఇక్కడ కమ్యూనిస్టులు కూడా బలం ఎక్కువే. వారు అయిదుసార్లు గెలిచారు. ఇక 2014లో టీఆర్ఎస్, మళ్ళీ 2018లో కాంగ్రెస్ గెలిచింది. ఏదేమైనా గాని ఇక్కడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఎక్కువే. అందుకే కొందరు కార్యకర్తలు రాజగోపాల్ బీజేపీలోకి వెళుతున్నా సరే…ఆయన వెనుక బీజేపీలోకి వెళ్ళడం లేదు. అలాగే మునుగోడు ప్రజలకు పాల్వాయిపై ప్రత్యేకమైన అబిమానం ఉంది. అందుకే ఆయన వారసురాలు స్రవంతిని అభ్యర్ధిగా పెట్టాలని కాంగ్రెస్ చూస్తుంది. అంటే అభిమానంతో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.

మొత్తానికి టీఆర్ఎస్ అధికారంతో, బీజేపీ ఆత్మగౌరవంతో, కాంగ్రెస్ అభిమానంతో మునుగోడులో పాగా వేయాలని అనుకుంటున్నాయి. మరి మునుగోడు ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.