తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే సంగతి తెలిసిందే…ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నడిచిన రాజకీయాలు….ఇటీవల బీజేపీకి అనుకూలంగా నడవడం మొదలయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త పుంజుకుంటుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా సరే…ఎంఐఎం పార్టీకి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు…రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన సరే…ఎంఐఎం కు వచ్చే సీట్లు ఏడు…ఈ ఏడు సీట్లలో మరో పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉండదు.
అంటే పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న పాతబస్తీలో ఈ సారి ఎంఐఎం కు చెక్ పెడతామని అంటుంది…ముస్లిం మహిళలు ఎంఐఎంని వద్దు అంటున్నారు..వారు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. ఈ సారి ఎంఐఎం సీట్లలో సత్తా చాటుతామని చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడంతో పాటు….పాతబస్తీలో ఎంఐఎం ని నిలువరిస్తామని అంటున్నారు.
ఎలాగో గోషామహల్ సీటు బీజేపీ చేతుల్లోనే ఉంది…ఆ సీటులో బీజేపీ మళ్ళీ సత్తా చాటేలా ఉంది. అలాగే ఎంఐఎం చేతుల్లో ఉన్న ఏడు సీట్లలో మలక్‌పేట, కార్వాన్, చాంద్రాయణగుట్ట సీట్లలో తమకు పట్టు ఉందని బండి అంటున్నారు. వీటితో పాటు హైదరాబాద్ ఎంపీ సీటు కూడా గెలుస్తామని బండి చెబుతున్నారు. మొత్తానికైతే పాతబస్తీలో ఎంఐఎంకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ…ఆపరేషన్ పాతబస్తీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
అయితే బండి చెప్పినట్లుగా పాతబస్తీలో బీజేపీ సత్తా చాటడం అంత సులువా? అంటే చాలా కష్టమనే చెప్పాలి…సాధారణంగా ముస్లిం ఓటర్లు…బీజేపీకి యాంటీగానే ఉంటారు….కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటారు. ఆ రెండు పార్టీలే ఇప్పటివరకు ఎంఐఎం సీట్లలో ప్రభావం చూపలేకపోతున్నాయి. ప్రస్తుతం ఎంఐఎం చేతులో హైదరాబాద్ ఎంపీ సీటుతో పాటు…కార్వాన్, చాంద్రాయణగుట్ట, మలక్ పేట్, యాకుత్ పురా, బహదూర్ పురా, ఛార్మినార్, నాంపల్లి అసెంబ్లీ సీట్లు ఎంఐఎం చేతులో ఉన్నాయి.
ఈ సీట్లలో బీజేపీకి పెద్ద బలం లేదు….గత ఎన్నికల్లో ఒక్క ఛార్మినార్ లోనే కాస్త ఓట్లు ఎక్కువ వచ్చాయి…మిగిలిన స్థానాల్లో పెద్ద ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికీ ఆ స్థానాల్లో బీజేపీ బలం పెరిగినట్లు కనిపించడం లేదు. కాకపోతే కొద్దో గొప్పో ముస్లిం ఓటర్లని ఆకర్షిస్తే…బీజేపీ కాస్త పట్టు సాధించవచ్చు…అయితే పాతబస్తీలోని ముస్లిం ఓటర్లు బీజేపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే అది చెప్పలేం. ఎంఐఎం ని కాదని ముస్లిం ఓటర్లు బీజేపీ వైపుకు వచ్చే విషయం డౌటే.
అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ పుంజుకుంటున్న క్రమంలో పాతబస్తీలో బీజేపీకి కాస్త పట్టు దొరికిన ఆశ్చర్యపోనవసరం లేదు. బండి అన్నట్లు కార్వాన్, మలక్ పేట్, చాంద్రాయణగుట్ట లాంటి స్థానాల్లో బీజేపీ ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే నాంపల్లిలో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది…గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతోనే ఓడిపోయింది. మరి చూడాలి పాతబస్తీలో బీజేపీ ఏ మేర సత్తా చాటుతుందో.