నిజానికి జగన్ విజయం కనబడాలంటే, ఆయన రోడ్‌షోలకో, సభలకో వెళ్లక్కర్లేదు. తెలుగుదేశం సభ చూస్తే చాలు. చంద్రబాబు ప్రసంగాల్లోనే జగన్ విజయం తొంగిచూస్తూంటుంది. ఆ నాయకుల కళ్లల్లోనే వైఎస్సార్ జయపతాక రెపరెపలాడుతూంటుంది.
సాధారణ ఎన్నికలు-2019 నోటిఫికేషన్ నేడు విడుదలైంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కూడా అదేచేత్తో విడుదల చేశారు. త్రిముఖపోటీలా కనిపిస్తున్న ద్విముఖపోరుకు రంగం సిద్ధమయింది.
అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఇటు వైఎస్సార్‌కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. వారితోపాటు జనసేనానాయకుడు పవన్‌కళ్యాణ్ కూడా వీలైంతమేరకు ప్రచారం నిర్వహిస్తున్నాడు.
ఎన్నికల ప్రచారసభల్లో ఈసారి మొదటిసభనుంచే చంద్రబాబు విచిత్రమైన పోకడను ఎంచుకున్నాడు. తనకుతానే చెప్పకున్నట్లు, భారతరాజకీయాల్లో కురువృద్ధుడు, అత్యంత సీనియర్, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి పైన పనిచేసిన నేత, జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నపుడు ఎలా మాట్లాడాలో తెలియనట్లు మాట్లాడుతున్నాడేంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే ఊసే లేకుండా, గడిచిన ఐదేళ్లల్లో తన ప్రభుత్వం సాధించిన ‘ప్రగతి’ ఏంటో చెప్పకుండా, అమరావతిలో నిర్మించిన అద్భుత ప్రాసాదాలను చూపించకుండా, పాడిందే పాడుకుంటూ.. ఊదరగొట్టేస్తున్నాడేంటి? ఎందుకిలా.?
కారణం, తన ఎదురుగా నిల్చుని, తననే చూస్తున్న నిలువెత్తు ఓటమి. పగలూరాత్రీ తేడా లేకుండా విరామమెరుగని పీడకలలు. మొత్తం తెలుగుదేశం క్యాడర్‌నంతా వెంటాడి, వేధిస్తున్న అపజయపు అలజడి. తెలుగుదేశం నాయకుల మొహాల్లోని గుంభనం వెనుక తొంగిచూస్తున్న అపనమ్మకం. టికెట్లిచ్చాక కూడా వీడని నైరాశ్యం. తనవాళ్లనుకున్నవాళ్లెవరిని చూసినా, ఇవన్నీ వాళ్ల మొహాల్లో బాబుకు నగ్నంగా కనబడిపోతున్నాయి…. ఇంకేం మాటలొస్తాయి.?
నిజానికి చెప్పుకోవడానికి మాత్రం ఏవుంది? అసలు శ్రమ లేకుండా, కేసీఆర్ పథకాలు.. స్పెల్లింగ్‌తప్పుతో సహా కాపీ కొట్టడం, పర్యాయపద నిఘంటువు నుండి కొత్త పేర్లు తగిలించడం (అన్నట్లు.. పక్కఫోటోలో ఒక మాస్టర్‘కాపీ’ ఉంది. గమనించండి). అడిగినప్పుడల్లా.. అమరావతిలో ఒక మాహిష్మతి. పోలవరంలో జాలువారుతున్న అవినీతి, ఎద్దుదూడలకు పసుపు-కుంకుమలతో హారతి… తెలుగుదేశంతో ఆంధ్రలో అద్భుత ప్రగతి.. ఇంకా వీటి గురించి మాటలెందుకు.? ఏదైనా మాట్లాడితే, కేసీఆర్, జగన్, మోడీల గురించే మాట్లాడాలి. మోడీకన్నా సీనియర్ కాబట్టి, కేసీఆర్ పైన పనిచేసినోడు కాబట్టి, ఇండ్లూ, మంచాలు వదిలేసి గుండెల్లో, బండల్లో నిద్రపోవాలి. దాంతో ఒకటే ఉక్కపోత. అసలే ఫ్యానుగాలి పడదు. పోనీ వేసుకుందామనుకున్నా, స్విచ్చేమో హైదరాబాద్‌లో ఉందాయె. కరెంటు ఢిల్లీనుంచి రావాలాయె. కష్టం కదా. అందుకే నిద్రపట్టదు. అదీ ఒకరకంగా మంచిదేలే. ఆ నిద్రలో వచ్చే కప్పదాట్లతో ఉలికిపాట్లు. పేపరోల్లేమో మాజీ ముఖ్యమంత్రి అని రాసేసినట్లు కలవరపాట్లు. పైగా ఇటు టికెట్లు… అటు వికెట్లు. పాపం… బొత్తిగా పడుకోలేకపోతున్నాడు మాస్టారూ… అందుకే అన్ని సభల్లోనూ సంధిప్రేలాపనలు. వేదికమీద విచారవదనాలు. కిందంతా నిశ్శబ్ద సమూహాలు.
ఇంకా నయం.. మన లోకేశ్‌బాబు వాళ్ల బాబుకన్నా బెటర్. అస్సలు భయం లేదు కదా.. అందుకే వివేకా హత్యకు పరవశించిపోతున్నాడు. తెలిసో,తెలియకో పెద్దపెద్ద కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాడు.
ఇంకోపక్క.. జగన్ సమరోత్సాహం. ఉప్పొంగుతున్న జనతరంగాలు. 3648 కిలోమీటర్ల పొడుగునా, 13జిల్లాల పర్యంతానా చూసిన, విన్న కన్నీళ్లు, కష్టాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అష్టకష్టాలకు, నవరత్నాల నవనీతం. ‘నేను చూసాను-నేను ఉన్నాను’ అనే భరోసా. పాదయాత్రలో అదే హోరు. ప్రచారయాత్రలోనూ అదే జోరు. ఎప్పుడు, ఎక్కడ, ఎటు చూసినా జనం.. ప్రభంజనం. ఒక్కమాటకు కోటి చప్పట్లు. జగన్నామస్మరణతో మార్మోగుతున్న ప్రాంగణాలు. ఆ ఉత్సాహమే 175 సీట్లు ఒకేసారి ప్రకటించేలా చేసింది. మనం అని కాకుండా జనం అన్నవాళ్లకే టికెట్లిచ్చింది.
నిన్నటి ఇరువురి సభలు, రోడ్‌షోలు ఆఖరికి టీవీల్లో చూసినవారికి కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోచరించింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో అప్రకటితంగా అనుభవమైంది. ఈ కింద ఉన్నది జగన్ నిన్నటి నెల్లిమర్ల రోడ్‌షో విడియో. ఇక ఎవరేం మాట్లాడక్కర్లేదు.
జగన్ ప్రతీమాటలో, ముక్కుసూటితనం, హుందాతనం.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తానేం చేయబోతున్నాడో క్లుప్తంగా వివరణ, ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో విశ్లేషణ నిక్షిప్తమైఉన్నాయి. అశేష జనవాహిని.. భూమి అంచుల వరకు కనబడుతున్న ప్రజాసాగరం…చెప్సాల్సిందేదో చెప్పకనే చెబుతున్నాయి.
నిజానికి జగన్ విజయం కనబడాలంటే, ఆయన రోడ్‌షోలకో, సభలకో వెళ్లక్కర్లేదు. తెలుగుదేశం సభ చూస్తే చాలు. చంద్రబాబు ప్రసంగాల్లోనే జగన్ విజయం తొంగిచూస్తూంటుంది. ఆ నాయకుల కళ్లల్లోనే వైఎస్సార్ జయపతాక రెపరెపలాడుతూంటుంది.
ఒక నాయకుడు కావాలీ అని జనం అనుకున్నప్పుడు, అదే సమయంలో ఇంకో నాయకుడు వద్దనీ అనుకున్నప్పుడు, వారి సమక్షంలోనే ఫలితం ప్రతిఫలిస్తూంటుంది. సాలోచగా పరికిస్తే, ముందే అందరికీ అర్థమవుతుంది. భయంతో కళ్లుమూసుకుంటే భవిష్యత్తు అంధకారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బావుండాలి. కొత్తరాష్ట్రం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కాలి. అందుకేనేమో.. ఒక ‘గాలి’ అటువైపే వీస్తోంది.
-రుద్రప్రతాప్