ప్రియాంకకు పోచంపల్లి చీర.. ప్రత్యేకతలు ఇవే..

-

హైదరాబాద్‌లోని సరూరనగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభకు ముఖ్యఅతిథిగా పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోచంపల్లి పట్టుచీరను బహుకరించారు. సభలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రియాంకకు పోచంపల్లి చీరను అందిచారు. పోచంప‌ల్లి చేనేత మ‌గ్గాల‌పై త‌యారు చేసిన చీర‌ను అందించే ముందు ఆ పట్టుచీర ప్రత్యేకతను, చేనేత కార్మికుల కష్టం గురించి కాసేపు వివరించారు. చీర అందిస్తున్న సమయంలో ప్రియాంక గాంధీ లేచి నిల్చుకున్నారు. భట్టి మాట్లాడుతున్న సేపు ఓపిగ్గా విన్నారు. ఆ పక్కనే రేవంత్ రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే, ఉన్నారు.

మగువుల మనసుదోచే పట్టుచీరలతో విశ్వఖ్యాతిని పొందిన పోచంపల్లి పట్టుచీరలకు ఎంతో విశిష్టత ఉంది. భూదాన్‌ పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇక్కడ చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారు. నేతన్నలు మగ్గాలపై ప్రత్యేకంగా పట్టు చీరలను తయారు చేస్తుంటారు. ఈ చీరలకు ఇండియాలోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు, మరెంతో ప్రత్యేకత ఉంది. పోచంపల్లి చీరలంటే ఇష్టపడని మహిళలు ఉండరంటే ఆ చీరలకు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఐరాస- ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఒకప్పుడు, అరబ్‌ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన పోచంపల్లి.. అదే ఇప్పుడు చేనేతలో కాటన్‌, పట్టు, సీకో వస్ర్తాలకు పేరుగాంచింది. పోచంపల్లిని ‘సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ అనీ అంటారు. నిజాముల కాలంలోనే చెట్లు, పూల నుంచి తీసిన సహజమైన రంగులతో ఇక్కడి చేనేత కార్మికులు రుమాళ్లు తయారు చేసేవారు. వాటిని అరబ్‌ దేశాలకు ఎగుమతి చేసేవారు. అరవై ఏండ్ల కిందటే టై అండ్‌ డై పద్ధతిలో మగ్గాల మీద నైపుణ్యంగా నేసేవారు.

1970 నుంచీ పట్టుచీరల నేతపై పట్టు సాధించారు. దేశంలో ప్రసిద్ధిచెందిన పదకొండు రకాల చేనేతల్లో పోచంపల్లి ఒకటిగా నిలిచింది. ఇదో ప్రత్యేక శైలి. రెండు దశాబ్దాల కిందటే ‘టై అండ్‌ డై’లో ‘జాగ్రఫికల్‌ ఇండికేషన్‌’ (జీఐ) గుర్తింపును సాధించింది. మొదటి పేటేంట్‌నూ పొందింది. ఫలితంగా, చేనేత ఉత్పత్తుల ఎగుమతి పెరిగింది. పోచంపల్లి కార్మికుల ప్రతిభ విశ్వవ్యాప్తం అయ్యింది. ఇక్కడి నేతన్నలు తమ నైపుణ్యంతో పద్మశ్రీ వంటి పురస్కారాలనూ అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news