ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాలకు సుపరిచితం అయిన రాజకీయ కుటుంబం మేకపాటి ఇంట నెలకొన్న తీవ్ర విషాదం పై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, గౌతం రెడ్డితో తమకున్న అనుబంధాన్ని స్మరిస్తున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు.వివాదాలకు దూరంగా మంత్రి పదవి నిర్వహించిన ఘనత ఆయనదేనని అన్నారు.జూబ్లిహిల్స్ లో ఆయన ఇంటికి నెల్లూరు టీడీపీ నేత సోమిరెడ్డితో సహా చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చి వచ్చారు.ఈ నేపథ్యంలో గౌతం రెడ్డి కారు డ్రైవర్ ఆ కొద్ది సేపట్లో ఏమయిందో అన్నది వివరంగా మీడియాకు వెల్లడించారు.కొద్ది పాటి వ్యవధిలోనే ఆయన ఈ లోకం విడిచి వెళ్లారని కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆయన బంధువులు,మరియు అనుచరులు.
ఆంధ్రావనిలో విషాదం అలుముకొంది.పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి గుండెపోటుతో చనిపోవడంతో ఒక్కసారిగా జగన్ వర్గాల్లో దిగ్భ్రాంతి నెలకొంది.మంత్రి ఉదయం లేవగానే తనను పిలిచారు వెంటనే వెళ్లగానే అక్కడే కుప్పకూలి ఉన్నారని, నీళ్లు తెమ్మన్నారని తెచ్చాక మళ్లీ కొద్ది సేపటికే కుప్ప కూలిపోయారని ఆయన డ్రైవర్ చెబుతున్నారు. లిఫ్ట్ లో దిగువకు వచ్చేటప్పటికే ఆయన నాలుక మడత పడిపోయి ఉందని, ఆస్పత్రి తీసుకువచ్చిన వరకూ ఊపిరి ఉందని,ఆస్పత్రికి తీసుకువచ్చిన గంటన్నరకు ఆయన చనిపోయారన్న వార్త వైద్యులు చెప్పారని వివరించారు.
2003 నుంచి తాను ఆయన దగ్గర పనిచేస్తున్నానని, తనను ఎప్పుడూ ఏమీ అనేవారు కాదని, నేనున్నా భయపడవద్దని చెప్పేవారని అన్నారు. ఆ విధంగా చెప్పిన వ్యక్తే ఇవాళ మన మధ్య లేకుండా పోయారన్నది డ్రైవర్ ఆవేదన.ఇక కేటీఆర్ మొదలుకుని మిగతా నేతలంతా అపోలో ఆస్పత్రికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.ఆయనతో తనకు 12 ఏళ్లుగా అనుబంధం ఉందని అన్నారు.వారి కుటుంబానికి ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమేనని చెప్పారు. మరోవైపు నెల్లూరులో విషాద కర వాతావరణం నెలకొంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి (మంత్రి తండ్రి) గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఉన్నపళాన చెట్టంత కొడుకు నేల కూలడంతో ఆయన అస్సలు తట్టుకోలేకపోతున్నారు.ఆయనను వైసీపీ సీనియర్లు, టీడీపీ లీడర్లు ఓదారుస్తున్నారు.