రావాలి జగన్ కావాలి జగన్ అని పాడుకోవడం తప్పు కాదు
అదేవిధంగా పాలనలో విభిన్నత ప్రదర్శించిన రోజు
ఎన్ని పాటలు అయినా మళ్లీ మళ్లీ పాడుకోవచ్చు
అందుకు తగ్గ వాతావరణం ఒకటి
ఆ రోజు తప్పక అనుకూలంగా ఉండడం ఖాయం.
వాస్తవాలు దాచి, క్షేత్ర స్థాయిలో జరిగే అవకతవకలు దాచి కేవలం పొగడ్తలు మాత్రమే ఓ పాలకుడి జీవితాన్ని మారుస్తాయి అని అనుకోవడం ఫక్తు అవివేకానికి సంకేతం. అసలు గ్రౌండ్ లెవల్ రియాల్టీ ఏంటన్నది తెలుసుకోకుండా ఈ మూడేళ్లు (దాదాపు) జగన్ పనిచేశారని అనుకోలేం కానీ అతి పొగడ్తల కారణంగా ఆయన చాలా సార్లు ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. రోజా, విడుదల రజనీ లాంటి వారి మాటలు అతిగా ఉంటాయి.అదే సమయంలో వాస్తవ దూరంగా ఉంటాయి. అదే సీనియర్లు చెప్పే మాటలు నిజాలకు కాస్తో కూస్తో దగ్గరగానే ఉంటాయి. అందుకే జగన్ కు నిజాలు చెప్పే వారు కన్నా అబద్ధాల పేరిట ప్రశంసలు వినిపించేవారంటేనే ఎక్కువ ఇష్టమేమో!
జగన్ ను పొగిడితే ఏమొస్తుంది..జగన్ అనే కాదు పవన్ అనే కాదు ఎవ్వరిని పొగిడినా వచ్చే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. భిన్నంగా ఉంటూనే రాజకీయం చేసేందుకు లేదా నడిపేందుకు ఎక్కువ ఇష్టం చూపిస్తారు.ఈ క్రమంలో మీడియాలో అయినా లేదా బయట అయినా తనను పొగిడే వ్యక్తులకు కాస్త ప్రాధాన్యం కూడా ఎక్కువగానే ఇస్తారు అన్నది ఇప్పటికే సుస్పష్టం. ఆ విధంగా జగన్ కొన్ని సార్లు వాస్తవాలు గుర్తించలేని స్థితికి చేరుకుంటున్నారన్న విమర్శ ఒకటి సొంత గూటి నుంచి వచ్చినా దానిని పట్టించుకోరు గాక పట్టించుకోరు.
పొగడ్త ఏదయినా ఆనందాన్ని ఇస్తుంది.విమర్శ ఏదయినా మనస్సులను నొప్పిస్తుంది.అందుకే రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రశంసలకే విలువ ఇస్తుంటారు. సహేతుక విమర్శ అయినా సరే ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉండరు.అదేవిధంగా తమపై ఏవయినా నిందాపూర్వక కథనాలు వచ్చినా తట్టుకోలేరు. ఆరోపణలతో కూడిన కథనాలు వచ్చినా సహించలేరు. అందుకే నాయకుల చుట్టూ కొందరు అదే పనిగా పొగడ్తలు కురిపిస్తూనే ఉంటారు. అతి పొగడ్త ప్రమాదకరం అని ధర్మాన లాంటి కొద్ది మంది నాయకులే అంటుంటారు కానీ చాలా మంది మాత్రం ఇందుకు భిన్నంగా తమ చుట్టూ ఉండే వ్యక్తుల్లో పొగిడే గుణం ఎక్కువగా ఉంటే వారినే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు.
అసలు కారణం లేకుండా వచ్చే ప్రశంస కారణంగా అభివృద్ధి ఉండదు. వ్యక్తి అభివృద్ధి కానీ వ్యవస్థ అభివృద్ధి కానీ లేదా ఉన్నతి కానీ సాధ్యపడదు. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కారణం లేని పొగడ్తలకు ఎందరెందరో విలువ ఇస్తూనే ఉంటారు. వాస్తవిక విషయాలకు దూరంగా ఉండే పొగడ్తల కారణంగా ఎందరో ప్రజా క్షేత్రంలో పరువు పోగొట్టుకున్నారు.పదవులు సైతం పోగొట్టుకున్నారు.విచిత్రం ఏంటంటే జగన్ సర్కారులో పొగిడే వారికే ఎక్కువ విలువ ఉంటుందని., అంతర్గతంగా ఏదయినా మంచి చెప్పినా పాటించే వారే ఉండరని చాలా మంది సీనియర్ వైసీపీ నాయకులు తమ స్నేహితుల దగ్గర వాపోయిన దాఖలాలు ఉన్నాయి.