ప్రభాస్‌తో షా.. కేసీఆర్‌ని ఇరికించే స్కెచ్..!

ఈ మధ్య బీజేపీ జాతీయ నాయకులు…వరుసపెట్టి తెలుగు హీరోలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే దిశగా ముందుకెళుతున్న బీజేపీ అనూహ్యంగా తెలుగు హీరోల మద్ధతు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో బీజేపీ పొత్తులో ఉంది. ఇక ఆ మధ్య ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రారంభోత్సవానికి చిరంజీవిని ఆహ్వానించారు. మోదీ పక్కనే చిరంజీవి కూర్చున్నారు.

ఇక ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణకు చెందిన హీరో నితిన్‌తో..ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ కొట్టిన నిఖిల్‌తో కూడా బీజేపీ అగ్రనేత భేటీ అయ్యారని తెలిసింది. ఇదే క్రమంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని..హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా..ప్రభాస్‌తో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది.

అయితే ఇటీవలే ప్రభాస్ పెదనాన్న, బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన..ప్రభాస్‌ని కలిసి పరమర్శిస్తారని తెలిసింది. పరామర్శించడానికైన సరే ఇందులో రాజకీయ కోణం ఉంటుందని, కృష్ణంరాజు తర్వాత బీజేపీలో ప్రభాస్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికే భేటీ జరగొచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్‌కు ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా…ఎలాగోలా ప్రభాస్ చేత ప్రచారమైన చేయించుకోవాలనే కాన్సెప్ట్‌తో బీజేపీ ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో సెప్టెంబర్ 17న షా..పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో ఓ కీలక ప్రకటన కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆ ప్రకటన ఏంటి అనేది బయటకు రాలేదు గాని…మొత్తానికి కేసీఆర్‌ని ఇరుకున పెట్టేలా మాత్రం ఒక ప్రకటన ఉండబోతుందని తెలుస్తోంది. అదే సమయంలో కేసీఆర్ సైతం..ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ విలీన వేడుకల్లో పాల్గొంటారు. రెండు సభలు ఒకేసారి జరగనున్నాయి. మొత్తానికి 17న హైదరాబాద్‌లో రాజకీయ యుద్ధమే జరిగేలా ఉంది.