ఎన్నికల ఫలితాలకు మరో వారం రోజులే ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో వేడి ఊపందుకుంది. ఇప్పటివరకు అన్ని సర్వేలు, స్టడీలు వైఎస్సార్‌సీపీకే అనుకూలంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. దాంతో తెలుగుదేశం తమ్ముళ్లు డీలాపడపోయి ఉన్నారనకుంటే, ఉన్సట్టుండి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే బాంబు పేల్చారు.
నిన్నటి మంత్రివర్గ సమావేశానికి ముందు, తన మంత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మధ్యలో సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈనెల 19న లోక్‌సభ ఎన్నికలు ముగుస్తున్నందున, అదేరోజు సాయంత్రం అన్ని మీడియా సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాయన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో ఫలితాలు వైసీపీకే అనుకూలంగా రావచ్చనీ, తెలుగుదేశం క్యాడర్ ఆందోళన చెందవద్దని ఆయన మంత్రివర్గ సహచరులకు అభయమిచ్చారు. దాంతో ఒక్కసారిగా ఖంగుతిన్న మంత్రులు, అలా ఎలా చెపుతున్నారు సర్? అని అంటుండగా, ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తామనీ, ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు.
ఎగ్జిట్ పోల్స్ వాళ్లకి అనుకూలంగా ఉంటే, మనమే గెలుస్తామని ఎలా అంటున్నారో తమకు అర్థం కావడంలేదని ఒక సీనియర్ మంత్రి వాపోయారు. తామంతా ఆయన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటుంటే, ఆయనేమో వాళ్లవైపే ఎగ్జిట్‌పోల్సని చెప్పి వెళ్లిపోయారు. ఇదెక్కడి గొడవరా బాబూ? అంటున్నారు. ఇదిలా వదిలేసి, మళ్లీ మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదని, అయితే గియితే గడ్కరీ, రాజ్‌నాధ్‌లకు అవకాశముందని బాబు అన్నట్టు సమాచారం. ఎన్డీయే అసలు అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదని, ఒకవేళ వచ్చినా, పైవాళ్లే ప్రధానులవుతారని తనకు విశ్వసనీయ సమాచారముందని మంత్రులతో అన్నట్టు తెలిసింది. ఒకవేళ గడ్కరీ కనుక ప్రధాని అయితే తమకు సంతోషమేనని, ఆయనతో తనకు సత్సంబంధాలున్నాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేసారట. అయితే ముందుగా చర్చ జరిగిన ఎగ్జిట్‌పోల్స్ విషయమే మంత్రులకు విస్మయాన్ని, ఆందోళనను కలిగిస్తోంది.