ఏం మాట్లాడినా చెల్లుతుంది
అధికారం ఉన్నంత వరకూ
ఏం మాట్లాడినా నెగ్గుతుంది
అధికారం ఉన్నంత వరకూ
ఏం మాట్లాడినా మీడియాలో కూడా
చెలామణీ అవుతుంది
అధికారం ఉన్నంత వరకూ
అదే అధికారం కోల్పోయాక
ఎవ్వరిని ఎవ్వరూ పట్టించుకోరు
అనేందుకు తార్కాణాలెన్నో !
ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా మానియా నడుస్తోంది. ఇదే ఉత్సాహం అందుకున్న అధికార పార్టీ నాయకులు నాటు భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నాటు నాటు నాటు అంటూ నా మాట చూడు నా పాట చూడు అని చెబుతూ అత్యుత్సాహంతో ఊగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు తమకు వస్తాయని చెబుతున్న వైసీపీని ఢీ కొనే శక్తి లేదని అంటూనే పవిత్రమయిన సభలో బూతులు మాట్లాడుతూ ఇవే తమ స్థాయిని మరింత పెంచేవి కానున్నాయని చెబుతున్నారు. ఆ విధంగా తమ స్థాయి మరిచి ప్రవర్తించినా అది కూడా తప్పేం కాదని తమని తాము సమర్థించుకుంటున్నారు. ఇంత జరిగినా భాష విషయమై దిద్దుబాటు లేదు. పశ్చాత్తాపం అంత కన్నా లేదు. ఇదీ మన గౌరవ పాలకుల తీరు. మీరు ఏమీ అనకండి ప్లీజ్ ! వాళ్లంతే …!
అదో టైపు అని సర్దుకుపోండి అని విపక్షం అంటోంది. అధికారం కోల్పోయి ప్రజాగ్రహం పొందే వరకూ ఇదే భాషను వీళ్లు కొనసాగిస్తారని కూడా అంటోంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వినకూడని భాష వివిధ మాధ్యమాల ద్వారా వినపడుతోంది. అయితే తమ భాష అన్నది చెడ్డదే కాదని స్థానిక మాండలిక పదాలే తాము వాడుతున్నామని అంటున్నారు వైసీపీ సభ్యులు. తమని తాము సమర్థించుకుంటూనే విపక్ష సభ్యులను అదే పనిగా మళ్లీ మళ్లీ తిట్టి పోస్తున్నారు. అర్థవంతం అయిన చర్చకు తావివ్వకుండా ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ప్రవర్తిస్తున్నారు అన్నది ఇవాళ ప్రజా సంఘాల ఆరోపణ.
డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామిని ఏమీ అనొద్దు.ఆయనేం మాట్లాడినా విని ఊరుకోండి.ఆ పాటి ధైర్యం మీలో ఉంటే అణిచిపెట్టుకోండి. ఆ పాటి సాహసం మీతో ఉంటే దానిని కూడా వాడకుండా వదిలేయండి. ఎందుకంటే ఆయనేం మాట్లాడినా జగన్ నవ్వుతారు. ఆయనేం మాట్లాడినా వైసీపీ సభ్యులు బల్లలు చరిచి మరీ ! మద్దతు తెలుపుతారు.ఆ విధంగా ఏపీ అసెంబ్లీలో ఆయన మొన్నటి వేళ వాడిన పదాలు,విపక్ష నేతలను ఉద్దేశించి వాడిన పదాలు అస్సలు మరువలేం. అయినా కూడా ఆయనే మాకు డిప్యూటీ సీఎం. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజల పుణ్యం కూడా ఇదే కావొచ్చు.
ఇంకా చెప్పాలంటే తమిళ వాసనలు తగితే తెలుగు నేలకు చెందిన ప్రజలందరి అదృష్టం కూడా ఇదే! అయినా కూడా జగన్ ఏమీ అనరు.అననివ్వరు కూడా! మీడియా ది ఉన్మాదం వారిని అడ్డుకుంటే చాలు అని మాత్రమే అంటారు. కానీ తప్పుడు పద్ధతుల్లో రాయడానికి వీల్లేని భాషలో రాసే నాయకులకు మాత్రం జగన్ నియంత్రణ అస్సలు ఉండదు అని ఇవాళ టీడీపీ ఓ ఆరోపణ చేస్తోంది. తమకు మాట్లాడే అవకాశమే లేదని అలాంటప్పుడు తాము సభకు వచ్చినా రాకున్నా ఒక్కటేనని ఆవేదన చెందుతున్నారు. ఇదే దశలో సభలో లేని వ్యక్తిని ఉద్దేశించి ఓ హోదా ఉన్న వ్యక్తి ఆ విధంగా దిగజారుడు భాష మాట్లాడవచ్చా అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాము సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.