ఏపీలో దొంగ ఓట్ల కలకలం రేగుతుంది..అలాగే ఓట్ల తొలగింపుపై కూడా చర్చ నడుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, వైసీపీ సానుభూతి పరుల ఓట్లని తొలగించే కార్యక్రమం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ…టీడీపీ సానుభూతిపరుల ఓట్లని తొలగిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం,ఎన్నికల సంఘం అధికారి రాష్ట్రానికి వచ్చి..విచారణ చేసి..మళ్ళీ తొలగించిన ఓట్లని పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే దొంగ ఓట్ల అంశంపై పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో, కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేయించి వైసీపీ గెలిచిందని టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపనలు చేస్తుంది. ఆఖరికి పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి జనాలని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని టీడీపీ ఆరోపిస్తుంది. అటు కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో గెలుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అదే తరహా కామెంట్స్ చేశారు. ఇక దీనిపై టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు దొంగ ఓట్లకు ఆద్యుడు పెద్దిరెడ్డి అని టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు దొంగ ఓట్లు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో కుప్పంలో గెలవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇలా దొంగ ఓట్లపై రెండు పార్టీలు వాదించుకుంటున్నాయి. అయితే దొంగ ఓట్లు అనేది ఏపీలో ఉన్నాయనే ఆరోపనలు ఉన్నాయి. ఇప్పటికే ఓట్ల తొలగింపుపై పెద్ద రచ్చ జరుగుతుంది..ఇక దొంగ ఓట్లు అంటూ మరొక రచ్చ..మరి నెక్స్ట్ ఎన్నికల్లో దొంగ ఓట్లు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.