సాగర్ ఉపఎన్నికలో ప్రో.కోదండరాం ఎత్తుగడ ఫలిస్తుందా ?

-

ఉద్యమాలు చేసినంత మాత్రాన సాధరణ ఎన్నికల్లో జనం జై కొడతారన్న గ్యారెంటీ లేదు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రోఫెసర్ కోదండరాం ఇదే తెలుసుకున్నట్టు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత మనసు మార్చుకున్న ప్రోఫెసర్ సాగర్ ఉపఎన్నికలో సైలెంట్ అవ్వడం వెనుక ఉన్న వ్యూహం పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఏ ఎన్నికల్లో అయినా పోల్ మేనేజ్‌మెంట్‌ లేకపోతే ఇబ్బందే. వీటి పై ఇప్పుడు అవగాహన వచ్చిందో ఏమో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక ప్రకటన చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీ చేయడం లేదని.. అలాగే ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ ప్రకటనపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. కోదండరాం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టడానికే ప్రొఫెసర్‌ కొత్త ఎత్తుగడ వేశారని కొందరు అభిప్రాయపడుతున్నారట.

గతంలో కాంగ్రెస్‌ నుంచి ఆయనకు ఎదురైన అనుభవాలను ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల మాదిరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోదండరామ్‌కు హ్యాండిచ్చిందనే అభిప్రాయంలో తెలంగాణ జనసమితి ఉంది. దానికి ఈ రూపంలో రివెంజ్‌ తీర్చుకోవచ్చని కొందరు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ప్రొఫెసర్‌ నిర్ణయంపై మరో చర్చ జరుగుతోంది. ఉపఎన్నికలో పోటీ చేసి శ్రమ వృథా చేసుకోవడం ఎందుకనే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చని చెబుతున్నారు.

కోదండరామ్‌ ఎమ్మెల్సీగా పోటీ చేసినా ఏ ఒక్కరూ సహకరించ లేదు. ముందస్తు ఎన్నికల్లో కలిసి పని చేసిన కాంగ్రెస్ ఆఖరి వరకు ఊరించి ఉసూరు మనిపించింది. ఉద్యమంలో కలిసి పని చేసిన కామ్రేడ్స్‌ హ్యాండిచ్చారు. జనాన్ని నమ్ముకుని బరిలో దిగితే మూడో ప్లేస్‌కి పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఎన్నికల్లో గెలుపోటములకంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలో జరిగిన రాజకీయాలపైనే ఎక్కువ ఆలోచిస్తున్నారట కోదండరాం. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో కోదండరామ్‌ ఎవరికో ఒకరికి మద్దతు ఇస్తారని అంతా అనుకున్నారు.

రాజకీయ పార్టీల మీద కోదండరాం తన నిరసన తెలపాలి అనుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇది కాంగ్రెస్‌కే ఇబ్బందేమోనని కొందరు లెక్కలు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news