గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని .. తన సొంత కళ్యాణ మండపం.. కె-కన్వెన్షన్‌లో ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా.. గోవా, సిక్కిం తరహా.. క్యాసినో నిర్వహించారని.. మూడు రోజుల పాటు ముచ్చటగా ఎక్కడెక్కడి నుంచో హైఫై వ్యక్తులను ఆహ్వానించి మరీ.. ఇక్కడ జూదం నిర్వహించారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, వీటికి సంబంధించి.. కొన్ని చానెళ్లలోఆధారాలతో సహా.. ప్రచారం చేశారు. అయితే.. ఈ క్రమంలో వీటిని ఖండించిన.. టీడీపీ.. వెంటనే వీటి అంతు తేల్చాలని నిర్ణయించింది.
అయితే.. ఈ క్రమంలో మంత్రి నానిని టార్గెట్ చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కానీ, వ్యూహమే లోపంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే… టీడీపీ ఈ వివాదంపై నిజనిర్ధారణ కమిటీని వేసింది. ఐదుగురు నాయకులతో ఈ కమిటీని గుడివాడకు పంపించింది. అక్కడ ఏం జరిగిందో.. తేల్చాలని ఆదేశించింది. కానీ, ఇదే పెద్ద మైనస్ అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అక్కడ ఏం జరిగిందో అన్ని మీడియాల్లోనూ వచ్చేసిన తర్వాత.. ఇక, అక్కడ నిజం ఎక్కడ దాగి ఉందని.. దీన్ని పరిశోధించేందుకు టీడీపీ ప్రయత్నించిందని.. ప్రశ్నలు వస్తున్నాయి.
అంతేకాదు.. నిజనిర్ధారణ పేరుతో టీడీపీ దీనిని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించిందనే వాద నవినిపిస్తోంది. కళ్లముందు అన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపై న్యాయపోరాటానికైనా దిగాలి. లేదా.. దీనికి సమానమైన చర్య అయినా చేపట్టాలి. కానీ, అలా చేయకుండా.. కేవలం నిజనిర్ధారణ పేరుతో టీడీపీ చేసిన పని సక్సెస్ కాకపోతే… మరింత వివాదంగా మారి.. నేతలను కేసుల్లో ఇరికించింది. మరి దీనివల్ల టీడీపీ సాధించింది ఏంటి? అనేది కీలక ప్రశ్న. అన్ని సమయాల్లోనూ..ఒకే మంత్రం వేస్తామంటే.. పని జరుగుతుందా? అనేది ప్రశ్న.
పైగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ఈ విషయంలో టీడీపీని ఇరికించేలా మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయని, అవి క్యాసినో కాదు అని, దీనికి కొడాలికి సంబంధం లేదని, టీడీపీ హయాంలో తాము పనిచేసామని, అప్పుడు నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు జరిగాయని.. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో నానా యాగీ చేస్తోందని నిప్పులు చెరిగారు. ఇక వంశీ విమర్శలతో టీడీపీ నిజనిర్ధారణ రివర్స్ అయ్యి.. చివరికి టీడీపీనే బుక్ అయ్యే పరిస్తితి వచ్చింది. కాబట్టి టీడీపీ నేతలు ఇప్పటికైనా.. సందర్భానుసారంగా వ్యవహరిస్తే.. మంచిదని అంటున్నారు పరిశీలకులు.