నాగర్‌కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ కంచుకోట..ఈ స్థానంలో కారు హవా ఎక్కువగా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఈ స్థానంలో ఒకప్పుడు టిడిపి-కాంగ్రెస్ పోటాపోటిగా విజయాలు సాధించేవి. 1984, 1996, 1999, 2004 ఎన్నికల్లో టిడిపి గెలవగా, మిగిలిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం బిఆర్‌ఎస్ విజయం సాధించింది.
అయితే ఈ సారి పార్లమెంట్ స్థానంలో బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్, బిజేపి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. కాకపోతే ఓట్ల చీలికలో మళ్ళీ బిఆర్‌ఎస్ పార్టీకి లాభం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఈ సారి పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. త్రిముఖ పోరు నడిచేలా ఉంది. పార్లమెంట్ పరిధిలో వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క కొల్లాపూర్ లోనే కాంగ్రెస్ గెలవగా, మిగిలిన స్థానాల్లో బిఆర్‌ఎస్ గెలిచింది.
అయితే తర్వాత కొల్లాపూర్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో ఏడు స్థానాలు బిఆర్‌ఎస్ కంట్రోల్ లోనే ఉన్నాయి. ఇపుడు ఆయా స్థానాల్లో రాజకీయం మారుతుంది. గద్వాల్, కల్వకుర్తిలో బిఆర్‌ఎస్ పార్టీకి బిజేపి గట్టి పోటీ ఇస్తుంది. ఈ సారి కల్వకుర్తిలో బిజేపికి లీడ్ కనిపిస్తుంది. ఇక వనపర్తి, ఆలంపూర్, అచ్చంపేట స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది.
నాగర్ కర్నూలులో సైతం బిఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంది. ఇక కొల్లాపూర్ లో బిఆర్‌ఎస్ లో వర్గ పోరు నడుస్తోంది. ఒకవేళ బిఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు..కాంగ్రెస్ లేదా బిజేపిలోకి వెళ్ళి పోటీ చేస్తే కొల్లాపూర్ లో బిఆర్‌ఎస్ పార్టీకి చెక్ పడే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ సారి నాగర్‌కర్నూలు పార్లమెంట్ పరిధిలో బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్, బిజేపి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి.