సాహో ‘ఆజాద్’ చంద్రశేఖర్..

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేశ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా లాంటి స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి ఆజాద్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

చంద్రశేఖర్ ఆజాద్… ప్రతి భారతీయుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. జులై 23, 1906లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నవొ జిల్లా బాదర్కాలో జన్మించారు.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేశ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా లాంటి స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి ఆజాద్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

శత్రువు చేతికి ఎప్పుడూ సజీవంగా చిక్కకూడదనేది ఆయన సిద్ధాంతం. మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్యం కోసం సహాయ నిరాకరణోద్యమం చేస్తున్న సమయంలోనే దేశం అంతా అట్టుడికింది. భారత స్వాతంత్ర్యం కోసం ఏదైనా చేయాలని తను కూడా నిర్ణయించుకున్నాడు చంద్రశేఖర్. అప్పుడు ఆయన వయసు 15 ఏళ్లు మాత్రమే.

అప్పుడు ఆయన చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబెట్టగా… నీ పేరు ఏంటి అంటూ… న్యాయమూర్తి అడిగితే ఆజాద్ అని చెబుతాడు. తండ్రి పేరు ఏంటి అని అడిగితే స్వాతంత్ర్యం అని.. మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే జైలు.. అంటూ ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పిన వ్యక్తి చంద్రశేఖర్.. అలా చంద్రశేఖర్ కాస్త చంద్రశేఖర్ ఆజాద్ అయ్యారు.

తన స్నేహితుడు రాంప్రసాద్ బిస్మిల్ తో కలిసి ప్రభుత్వ ధనం ఉన్న రైలును ఆపి దోపిడి చేస్తారు. అయితే.. మిగితా వాళ్లంతా పోలీసులకు చిక్కినప్పటికీ ఆజాద్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని పారిపోతారు.

తర్వాత భగత్ సింగ్, సుఖ్ దేవ్, ఇతర విప్లవ కారులతో కలిసి ఆజాద్ 1928 సెప్టెంబర్ లో హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీళ్లంతా లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారిని కాల్చి చంపుతారు. ఆసమయంలో మరో పోలీసు చనన్ సింగ్ భగత్ సింగ్, సుఖ్ దేవ్ ను పట్టుకోబోగా… చనన్ సింగ్ ను కాల్చి చంపుతాడు ఆజాద్.

తర్వాత వీళ్లంతా వేరే రహస్య ప్రదేశానికి వెళ్లిపోతారు. తర్వాత భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను పోలీసులు పట్టుకోవడం.. వాళ్లకు ఉరిశిక్ష పడటంతో వాళ్లను విడిపించడం కోసం శతవిధాలా ప్రయత్నించాడు ఆజాద్.

అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్కులో తన మిత్రులతో కలిసి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతుండగా… ఆజాద్ అక్కడున్నాడన్న సమాచారంతో పోలీసులను అక్కడి చేరుకొని కాల్పులు మొదలు పెడతారు. దీంతో ఆజాద్ కూడా పోలీసులపై కాల్పులు ప్రారంభిస్తారు. అప్పటికే పోలీసులు తనను చుట్టుముట్టారు. పోలీసులకు పట్టుబడటం ఏంది అనుకొని.. చివరి తూటా మిగిలి ఉండగా.. తనను తాను కాల్చుకొని నెలకొరిగారు ఆజాద్. అప్పటికి ఆజాద్ వయసు 25 ఏళ్లు మాత్రమే. ఆజాద్ అమరుడయిన 25 రోజుల తర్వాత భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ను బ్రిటీషర్లు ఉరితీశారు.