ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట్లు…!

-

ఇప్పుడు తెలంగాణ రాజకీయమంతా మునుగోడు చుట్టూనే తిరుగుతుంది…ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య ఉందో…ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో బయటకు రావడం లేదు..కేవలం మునుగోడు అంశమే హైలైట్ అవుతుంది. మూడు ప్రధాన పార్టీలు మునుగోడు చుట్టూనే రాజకీయం చేస్తున్నాయి…అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికని సెమీఫైనల్ గా తీసుకుని మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మూడు పార్టీలు తమ తమ వ్యూహాలతో రాజకీయం చేస్తున్నాయి.

మొదట అధికార టీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే…ఈ ఉపఎన్నిక ఆ పార్టీకి చాలా ముఖ్యం…ఇందులో ఓడిపోతే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది…అందుకే ఇక్కడ గెలవాలని టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అధికార పార్టీ గనుక..అధికార బలాన్ని మొత్తం ఉపయోగిస్తుంది. ఊహించని విధంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుంది.. ఉప ఎన్నిక ప్రభావంతో మునుగోడుకు చకచకా నిధులు ఇస్తుంది. తాజాగా డిండి లిఫ్ట్‌ నిర్వాసితులకు రూ.116 కోట్లు కేటాయించింది..అలాగే సర్వాయి పాపన్న జయంతి అధికారంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని మునుగోడులో ఎక్కువగా ఉన్న గౌడ్‌ కులం ఓట్లపై కన్నేసింది.

ఇక పద్మశాలిల ఓట్ల కోసం చేనేత బీమా అమలు చేయాలని చూస్తుంది. ఇక యోజకవర్గానికి 9 వేల ఆసరా పింఛన్లు అదనంగా ఇవ్వనుంది.  రూ.7 కోట్ల రోడ్లు, బ్రిడ్జిల పనులు చేయిస్తుంది. అలాగే తమ ప్రజాప్రతినిధులు చేజారకుండా ఒక్కొరికి 2 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. కొందరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బీజేపీ వైపు వెళ్లిపోతున్నారు..వారిని ఆపేందుకు అధికార పార్టీ నేతలు తమ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు ఒక్కొక్కరికి తాజాగా రూ.2 లక్షల చొప్పున అందజేసినట్టు సమాచారం. ఇక కేసీఆర్ సభని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కష్టపడుతున్నాయి. ఇది టీఆర్ఎస్ వర్షన్.

బీజేపీ విషయానికొస్తే…ఇక్కడ ముందు నుంచి బీజేపీకి బలం తక్కువ..ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో మునుగోడులో బీజేపీకి బలం పెరిగింది..అలాగే రాష్ట్ర నేతలంతా మునుగోడులోనే మకాం వేసి పనిచేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని బీజేపీలోకి లాగే పనిలో ఈటల రాజేందర్ ఉన్నారు. అటు బండి సంజయ్ పాదయాత్రలో కేసీఆర్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇటు కోమటిరెడ్డి…నియోజకవర్గంలో బలం పెంచుకునే కార్యక్రమంలు చేస్తున్నారు..కాంగ్రెస్ లోని బలంగా ఉన్న నేతలని తన వెంట తెచ్చుకోవాలని చూస్తున్నారు.

ఇక తాజాగా దిండి నిర్వాసితులకు… మల్లన్నసాగర్‌తో సమానంగా పరిహారం ఇవ్వాలని కోమటిరెడ్డి…స్థానిక ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెనుకే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉంటున్నారు. అటు మునుగోడు ఉపఎన్నిక ఇంచార్జ్ పదవి రేసులో ఈటల, జితేందర్ రెడ్డి, వివేక్ ఉన్నారు. మరి ఎవరిని ఇంచార్జ్ గా పెడతారో క్లారిటీ రాలేదు. అలాగే ఈ నెల 21న జరగనున్న అమిత్ షా సభని భారీ స్థాయిలో సక్సెస్ చేయాలని బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. ఇది మునుగోడులో బీజేపీ వర్షన్.

కాంగ్రెస్ విషయానికొస్తే…ఆ పార్టీలో కుమ్ములాటలే ఇంకా సర్దుకోలేదు. టి‌పి‌సి‌సి రేవంత్ రెడ్డి…మునుగోడులో గెలవాలని పనిచేస్తుంటే…కొందరు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఇలా సొంత పార్టీలోనే లుకలుకలు ఎక్కువైపోయాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిల వైఖరి అర్ధం కాకుండా ఉంది. ఇక ఆర్ధిక బలం కూడా తక్కువ ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ లు, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సిలు టీఆర్ఎస్ లేదా బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. వారిని  ఏ మాత్రం ఆపలేకపోతున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్ధిని పెట్టాలని చూస్తుంది…అలాగే కార్యకర్తల బలాన్ని నమ్ముకుని కాంగ్రెస్ ముందుకెళుతుంది..ఈ నెల 22 నుంచి రేవంత్ రెడ్డి మునుగోడులోనే మకాం వేసి పనిచేయనున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎక్కువైపోయారు…కాంగ్రెస్ లో ఉంటూ కొందరు కోమటిరెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే మునుగోడులో మూడు పార్టీలది మూడు దారులు అన్నట్లు రాజకీయం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news