బ్రిటీష్ పాలనకు ఎదురుతిరిగాడు.. 18 ఏళ్లకే ఉరితీయబడ్డాడు.. విప్లవ వీరుడు కుదిరామ్ బోస్

అతడి వయసు అప్పుడు కేవలం 18 సంవత్సరాల 8 నెలలా 8 రోజులు మాత్రమే. టీనేజ్ వయసు.. కాని.. అంత చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడతడు. ఆయనే కుదిరామ్ బోస్. అతి పిన్న వయసులోనే వీరమరణం పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు కుదిరామ్ బోస్ గురించి ఎంతమందికి తెలుసు. నూటికో కోటికో ఒక్కరికి తెలిసి ఉంటుంది. అందుకే.. ఇప్పుడు మనం ఆయన పోరాటం గురించి తెలుసుకుందాం.

అవి భారతీయులు బ్రిటీష్ పాలనతో విసిగి వేసారి పోయిన రోజులు. 3 డిసెంబర్ 1889 న ఇప్పటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కుదిరామ్ బోస్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి విప్లవ భావాలు కలిగిన కుదిరామ్.. దేశ స్వాతంత్ర్యం కోసం పరితపించేవాడు. చిన్నవాడైనప్పటికీ స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. అందుకోసమే విప్లమమార్గాన్ని ఎంచుకున్నాడు కుదిరామ్. అతడికి 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు.. అరబిందో మాటలతో స్ఫూర్తి పొందాడు. ఆ వయసులోనే స్వాతంత్ర్యం కోసం పరితపించిన కుదిరామ్ ను చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవారు. తన 16 ఏళ్ల వయసులోనే పోలీస్ స్టేషన్ దగ్గర బాంబులు పెట్టి ముగ్గురు బ్రిటీష్ అధికారులను హతమార్చాడు.

ఆ తర్వాత 1905 లో బెంగాల్ విభజన జరిగినప్పుడు.. విప్లవ కారులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన మెజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ ను హత్య చేయాలనుకున్నాడు. అతడిని చంపడం కోసం ఓ ప్లాన్ వేశాడు కుదిరామ్. దాన్ని అమలు కూడా చేశాడు. ఆ దాడిలో కింగ్స్ ఫోర్డ్ తప్పించుకున్నాడు. కానీ.. అతడి భార్య, పిల్లలు మృతి చెందారు. కుదిరామ్ పై రెండు కేసులు నమోదయిన కారణంగా అతడికి ఉరి శిక్ష విధించారు బ్రిటీష్ అధికారులు. ఆగస్టు 11, 1908 న కుదిరామ్ ను ఉరితీశారు. అతడికి ఉరి తీసినప్పుడు బోస్ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు కుదిరామ్ బోస్.