వచ్చే ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలు తమ వారసులని రంగంలోకి దింపాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరు నేతలు గ్రౌండ్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న జానారెడ్డి సైతం తన ఇద్దరి వారసులని బరిలో దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిని నాగార్జున సాగర్, మరొకరిని మిర్యాలగూడ బరిలో ఉంచుతారని టాక్.
దీంతో జానారెడ్డి పోటీపై క్లారిటీ లేదు. అయితే జానారెడ్డి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో మొదలైన విషయం తెలిసిందే. 1983లో చలకుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. మళ్ళీ అదే ఊపులో 1985లో గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి జంప్ చేసి 1989 ఎన్నికల్లో గెలవగా, 1994లో ఓటమి పాలయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో పోటీ చేసి గెలిచారు. ఇలా వరుస విజయాలు దక్కించుకున్న జానారెడ్డికి 2018లో షాక్ తగిలింది. ఆ తర్వాత ఉపఎన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఆ ఉపఎన్నికలోనే పోటీ చేయకూడదని జానారెడ్డి భావించారు..కానీ అధిష్టానం మాటతో మళ్ళీ బరిలో నిలిచారు. ఈ సారి మాత్రం పోటీ నుంచి తప్పుకుని ఇద్దరు తనయులని బరిలో దింపాలని చూస్తున్నారు. ఇందులో ఒక వారసుడు అయిన రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడలో పోటీ చేయించే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం అక్కడ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఉన్నారు. ఆయనకు అంత పాజిటివ్ లేదు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి జంప్ చేసిన ఈయన 2018లో గెలిచారు. అయితే ఇప్పుడు మిర్యాలగూడలో ఆయనకు పాజిటివ్ కనిపించడం లేదు. కాంగ్రెస్ బలపడుతుంది. దీంతో జానారెడ్డి వారసుడు బరిలో దింపితే పోరు రసవత్తరంగా మారుతుంది. చూడాలి మరి జానారెడ్డి వారసుడు బిఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెడతారో లేదో.