అవసరాలని బట్టి రాజకీయం చేయడంలో చంద్రబాబుని మించిన వారు లేరనే చెప్పాలి…అవసరం ఉంటే చాలు రాజకీయంగా శతృత్వాలు బాబు చూసుకోరు…తమ రాజకీయ అవసరాలని తీర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. అందుకే దశాబ్దాల పాటు బద్దశత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో సైతం బాబు పొత్తు పెట్టుకున్నారంటే..ఆయన రాజకీయం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క వైసీపీతో తప్ప…అన్నీ పార్టీలతోనూ బాబు పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిఆర్‌ఎస్, జనసేన…ఇలా ఒకటి ఏంటి చిన్నాచితక పార్టీలతో కూడా ఆయన పొత్తు పెట్టుకున్నారు.
ఇలా అవసరం కోసం బాబు ఏ పార్టీతోనైనా ముందుకెళ్తారు..అదే అవసరాన్ని బట్టి పొత్తు నుంచి బయటకు కూడా వచ్చేస్తారు. అలా చాలా సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని బయటకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక 2014లో కూడా పొత్తు పెట్టుకుని, 2018లో ఎలా బయటకొచ్చారో తెలిసిందే. ఓ రేంజ్ లో బీజేపీపై యుద్ధం చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాక…మళ్ళీ ఆయనలో మార్పు వచ్చింది. పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి దగ్గర కావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. కానీ బాబుని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చి చెప్పేస్తుంది. అయితే బాబు మాత్రం బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మానడం లేదు.
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాల్సిన అవసరం బాబుకు ఎంతైనా ఉంది. ఒకవేళ గాని అధికారంలోకి రాకపోతే బాబు పరిస్తితి ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే బాబు నెక్స్ట్ అధికారంలోకి రావడానికి తనకు కలిసొచ్చిన ఏ అంశాన్ని వదిలిపెట్టడంలేదు. సింగిల్ గా జగన్ ని ఎదురుకోవడం కష్టమని బాబుకు అర్ధమవుతుంది…అందుకే జనసేనతో పొత్తు కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు.
అయితే ఏపీలో అధికారంలోకి రావాలంటే కేంద్రంలోని బీజేపీ సపోర్ట్ అవసరం చాలా వరకు ఉంది..అందుకే బీజేపీని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏదొకవిధంగా బీజేపీకి దగ్గర జరగడానికే చూస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ అడగకపోయినా సరే..ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు మద్ధతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సహకరించమని బీజేపీ…వైసీపీని కోరింది గాని…టీడీపీని అడగలేదు.
అడగకపోయినా సరే బాబు..ద్రౌపది ఏపీలోకి వచ్చే ముందే మద్ధతు ప్రకటించారు. బాబు మద్ధతు ఇవ్వడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం.. టీడీపీ వారి మద్దతు కోసం రాష్ట్రపతి అభ్యర్ధిని నేరుగా వారి వద్దకే తీసుకురావడం, అలాగే చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పి, గతంలో ఆయన ఎన్డీయేకు సహకరించిన అంశాలని చెప్పుకొచ్చారు. ఇలా అవసరం లేకున్నా బాబు…బీజేపీతో బంధం కోసం…రాష్ట్రపతి అభ్యర్ధికి మద్ధతు తెలిపారు.
ఇదే సమయంలో కిషన్ రెడ్డి ద్వారా..మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది…ఎలాగో కిషన్ రెడ్డితో బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి..గతంలో పొత్తులో ఉండగా వారు కలిసి కూడా పనిచేశారు. దీంతో పాత పరిచయాలని ఉపయోగించుకుని బీజేపీకి దగ్గర కావాలని బాబు చూస్తున్నారు. అటు ఎలాగో పవన్ కల్యాణ్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కూడా బాబుకు దగ్గరవుతున్నారు. కానీ బీజేపీ మాత్రం బాబుని దగ్గరకు రానివ్వడం లేదు. అలా అని బాబు తన ప్రయత్నాలు ఆపడం లేదు. మరి చూడాలి చివరికి బీజేపీతో బాబుకు మళ్ళీ బంధం ఏర్పడుతుందో లేదో?